కడప జిల్లా దువ్వూరు మండలంలోని రైతులు సీరియస్ ఆవేదనలో ఉన్నారు. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం క్వింటాకు ₹2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవటంతో రైతులు తమ పంటను విక్రయించలేకపోతున్నారు.
మండల పరిధిలోని నీలాపురం, దాసరిపల్లె, బాలయపల్లె, మదిరేపల్లె, చిన్న సింగనపల్లె, పెద్ద సింగనపల్లె, చల్లబసాయపల్లె, గొల్లపల్లె, మన్నేరంపల్లె, గుడిపాడు, దువ్వూరు, ఏకోపల్లె, ఎంకుపల్లె, బాకరావుపేట, జిల్లెల్ల, కానగూడూరు గ్రామాల్లో దాదాపు 3,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు జరిగింది.
ఈ సారి అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ, మద్దతు ధర ఉన్నందున రైతులు కొంత ఊరట పొందారనుకున్నారు. అయితే, కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో దళారులు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ₹1,500–₹1,900 మధ్యలోనే కొనుగోలు చేస్తున్నారు.
రైతులు మాట్లాడుతూ, “మద్దతు ధర ప్రకటించడం సరిపోదు. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు నష్టపోతారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

