విశాఖపట్నం: కుటుంబ కలహం విషాదానికి దారితీసిన ఘటనలో దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం (33), ప్రియాంక (27) దంపతులు విశాఖపట్నంలోని శ్రీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.సమాచారం ప్రకారం, ఆదివారం బయటకు వెళ్లిన బలరాం ఫోన్ ద్వారా ఇంట్లో ఉన్న భార్య ప్రియాంకను బిర్యానీ తీసుకురావాలని కోరగా, ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మనస్తాపానికి గురైన ప్రియాంక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇంటికి చేరుకున్న బలరాం భార్య మృతదేహాన్ని చూసి తీవ్ర ఆవేదనకు గురై, అదే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సమయంలో వారి నాలుగేళ్ల కుమారుడు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఆత్మహత్య ఆలోచనలు లేదా మానసిక ఒత్తిడి ఉంటే వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. సహాయం కోరడం చాలా ముఖ్యమైనది.

