విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలను రెవిన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. భీమిలి మండలం కొత్తవలసకు సమీపంలో రిషికొండ వద్ద 15 ఎకరాలను ఎకరా లక్ష రూపాయలకు శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం కట్టపెట్టిన సంగతి తెలిసిందే. ఎకరా 15 కోట్లు విలువ చేసే భూమిని లక్ష రూపాయలకు దారాదత్తం చేయడంపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేసింది. అసహనం..దర్యాప్తు నివేదిక అందిన తర్వాత భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవిన్యూ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 225 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 15 లక్షలకు కట్టపెట్టడంపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. నిన్న భూమిని పంచనామా చేసి ఈరోజు స్వాధీనం చేసుకున్నట్లు రెవిన్యూ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సిసోడియాకి రెవిన్యూ అధికారులు సమాచారం పంపించారు.
15 లక్షలకే..గత వైసీపీ ప్రభుత్వం విశాఖ పీఠాధిపతి స్వరూపానందకు విశాఖలో రూ. 225 కోట్లు విలువచేసే 15 ఎకరాలను కేవలం రూ. 15 లక్షలకు కట్టబెట్టింది. ఆ సమయంలో ధర నిర్ణయించాలని అప్పటి కలెక్టర్ ను జగన్ ప్రభుత్వం కోరగా.. రిజిస్ట్రేషన్ విలువ పరిగణలోకి తీసుకుని ఎకరాకు రూ. 1.8 కోట్లు ఇవ్వొచ్చని సిఫార్సు చేశారు. కానీ నాటి సీఎం జగన్ ఎకరాను కేవలం లక్ష రూపాయాలకే ఇచ్చేశారు. అంటే. 15 ఎకరాలను రూ. 15 లక్షలకే ఇచ్చేశారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. *భూములు స్వాధీనం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శారదా పీఠానికి కేటాయించిన భూములపై విచారణ చేసింది. ఈ క్రమంలోనే నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేల్చింది. గత మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఈ భూముల కేటాయింపులను రద్దు చేయాలని తీర్మానించగా.. రెవెన్యూ శాఖ అందుకు తగినట్టుగా చర్యలు తీసుకుంది. తాజాగా, విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలను రెవిన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.