కడప /పులివెందుల, సెప్టెంబర్ 1 వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందుల పర్యటనలో భాగంగా భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలతో మమేకమయ్యారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలు, కష్టాలను జగన్‌కు వివరించారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించి, ఓపిగ్గా విన్న జగన్ వారికి భరోసా కల్పించారు. “నేనున్నాను, ఎవరూ అధైర్యపడొద్దు” అని ధైర్యం చెప్పారు.ప్రజాదర్భార్ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు టీడీపీ కూటమి ప్రభుత్వం తమపై అకారణ దాడులు చేస్తోందని వాపోయారు. దీనిపై స్పందించిన జగన్ కూటమి అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. “ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలి” అని సూచించారు.కూటమి పాలనలో పోలీసులు సహా అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు మేలు చేయాలి. కానీ ఈ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపే పనిగా పెట్టుకుంది” అని మండిపడ్డారు.తన ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేశామని జగన్ గుర్తుచేశారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.ప్రజాదర్భార్ సందర్భంగా క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది.
