Tv424x7
Andhrapradesh

** తురకపాలెంలో చావు భయం..

బాధితులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు. గుంటూరు రూరల్‌ మండలంలోని, తురకపాలెంలో ఇటీవల వరుసగా సంభవిస్తున్న అంతుచిక్కని మరణాలు కలవరపెడుతున్నాయి. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఈ క్రమంలో గ్రామాన్ని సిపిఎం బృందం సోమవారం సందర్శించింది. మృతుల కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించి, మృతికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. 35 నుండి 55 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న 30 మంది రెండు నెలల కాలంలో మరణించారు. జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు, ఒంటిపై గడ్డలు రావటం వంటి కారణాలతో హాస్పిటల్‌కు వెళ్లటం, రెండ్రోజుల్లో తగ్గిందని ఇంటికి రావటం, మళ్లీ అనారోగ్యంతో హస్పిటల్‌కు వెళ్లి మృత్యువాత పడటం ఆ గ్రామంలో సర్వసాధారణమైందని మృతుల కుటుంబీకులు వాపోయారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలోనే అత్యధిక మరణాలు సంభవించాయన్నారు. రెండు, మూడు సార్లు వైద్య బృందాలు గ్రామాన్ని సందర్శించినా మృతికి గల స్పష్టమైన కారణాలు తెలియట్లేదన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఉన్నత స్థాయి బృందాలతో తగిన కారణాలను పరిశీలించాలన్నారు. ఏడాదిన్నర కాలంలోనే ఆ గ్రామంలో సుమారు వంద మరణాలు సంభవించాయని, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, ప్రభుత్వం అక్కడి ప్రజలకు విశ్వాసం కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయని, ఒక్కొరూ ఆసుపత్రి ఖర్చులు రూ.ఐదారు లక్షలు వెచ్చించినా ఫలితం దక్కలేదని చెప్పారు. 60 ఏళ్లలోపు వయస్సు ఉండి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. గ్రామంలోని ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, మరణాల పరంపర నిలిచే వరకూ గ్రామంలో వెల్‌నెస్‌ సెంటర్‌లో రేయింబవళ్లు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని కోరారు. మృతుల వైద్యానికి సంబంధించిన ధ్రువపత్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేనందున ఇకపై ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన చికిత్స అందించాలని, తద్వారా గతంలో సంభవించిన మరణాలకు కారణాలు విశ్లేషించటం సులభం అవుతుందని చెప్పారు. గ్రామాన్ని సందర్శించిన వారిలో జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.భావన్నారాయణ, కె.నళినీకాంత్‌, నాయకులు బి.ముత్యాలరావు, మస్తాన్‌వలి, ఖాసింవలి, షేక్‌.భాషా, ఆది నికల్సన్‌, ఖాసింషహీద్‌, దీనరాజు, సాంబశివరావు, కోటేశ్వరరావు, తదితరులున్నారు.
పారిశుధ్యంపై తీవ్ర నిర్లక్ష్యం
గ్రామంలో మరణాలు సంభవిస్తున్నా పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో కాల్వలు శుభ్రం చేయని కారణంగా ఎక్కడి నీరు అక్కడే నిలిచింది. కొన్నిచోట్ల గడ్డి పెరిగింది. నీరు పారకపోవటంతో పెద్ద ఎత్తున దోమలు పెరిగి, అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. గ్రామంలోని ఇతర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేస్తున్నా తమ కాలనీలో మాత్రం చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. చాలా వరకూ కాల్వలు మట్టితో నీరు పారటానికి ఆటంకంగా ఉన్నాయి. గ్రామానికి పరిసరాల్లో ఉన్న మైనింగ్‌, క్రషర్ల వల్ల దుమ్ము, ధూళి చెలరేగి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లు, డస్ట్‌ రవాణా చేసే వాహనాలు గ్రామంలో నుండి రాకపోకలు సాగిస్తున్నాయి. దుమ్ము లేవకుండా ఆయా వాహనాలకు తగిన చర్యలు కూడా తీసుకోవట్లేదు. పరిసర ప్రాంతాలతోపాటు, పేరేచర్ల ప్రాంతాల్లోని క్రషర్ల నుండి గుంటూరు వెళ్లే వాహనాలు కూడా ఇదే దారిలో ప్రయాణిస్తున్నాయి దీంతో ఆ వాహనాల నుండి వస్తున్న దుమ్ము, ధూళి ప్రజల ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. చనిపోయిన వారిలో కూడా కొందరు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. పారిశుధ్యంపై డిప్యూటీ ఎంపిడిఒను వివరణ కోరగా ప్రతిరోజూ ఫాగింగ్‌ చేయిస్తున్నామని, బ్లీచింగ్‌ చల్లిస్తున్నామని చెప్పారు. మంగళవారం నుండి ఇతర ప్రాంతాల నుండి కార్మికుల్ని రప్పించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడతామన్నారు.

Related posts

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్

TV4-24X7 News

3రాష్టాల్లో బీజేపీ ఘనవిజయం మైదుకూరులో బిజెపి నాయకుల సంబరాలు

TV4-24X7 News

పుర్రి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment