అమరావతి:ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.“రాష్ట్రం మీ జాగీర్ అనుకున్నారా చంద్రబాబు..? ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా మీకు ఇప్పటికే పేరు ఉంది. మూడుసార్లు సీఎంగా పనిచేసిన మీరు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా ఏర్పాటు చేశారా..? కనీసం ఆ ఆలోచన అయినా చేశారా..?” అని జగన్ ప్రశ్నించారు.వైసీపీ ఐదేళ్ల పాలనలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. “రెండు సంవత్సరాలు కరోనా కారణంగా వృథా అయినా, మిగిలిన మూడు సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల పనులు ప్రారంభించాం. ఇప్పటికే ఐదు కాలేజీల్లో తరగతులు కూడా మొదలయ్యాయి. మిగిలిన పనులను ముందుకు తీసుకెళ్లకుండా మీరు అడ్డుకున్నారు. అలా చేయకపోతే గతేడాది మరో ఐదు, ఈ ఏడాది మరో ఏడు కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యేవి” అని వ్యాఖ్యానించారు.ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “నేను ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ స్వార్థం కోసం ప్రైవేటుపరం చేస్తారా..? ఇది అవినీతిలో మీ బరితెగింపు. దీంతో మీరు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేస్తాం. ఈ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తెచ్చి పేద విద్యార్థులకు వైద్య బోధనే లక్ష్యంగా ముందుకు వెళ్తాం” అని స్పష్టం చేశారు.

next post