కడప జిల్లాలో పండిన ఉల్లి పంటను ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1,200 ధరకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు పేర్కొన్నారు. ఈ కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.శనివారం టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ—ఉల్లి కొనుగోలు కోసం జిల్లాలో కమలాపురం, మైదుకూరు ఏఎంసీలలో రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.రైతులు తమ ఉల్లిపంటను ఆరబెట్టి, శుభ్రపరచి, గ్రేడింగ్ చేసి యార్డుకు తీసుకురావాలని సూచించారు.
e-Crop నమోదు చేసుకున్న రైతులు మాత్రమే విక్రయానికి అర్హులు. వారు తప్పనిసరిగా:
1. పట్టాదారు పాస్‌బుక్
2. ఆధార్ కార్డు
3. రైతు సేవా కేంద్రం ఇచ్చిన ఉల్లి పంట నమోదు సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ
యార్డుకు తీసుకురావాలని చెప్పారు.రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు చొరవ చూపాలని, జిల్లాలోని ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.అదనంగా, రైతులు సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నంబర్: 7095621491 లేదా ఏపి మార్క్‌ఫెడ్ జిల్లా అధికారి ఎం. పరిమళ జ్యోతిని సంప్రదించవచ్చని తెలిపారు