Chandrababu: చంద్రబాబు..గుడివాడ: ఏపీ సీఎం జగన్ ఒక రాజకీయ వ్యాపారి, అధికారం అంటే ఆయనకు దోపిడీ అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ‘రా..కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైకాపా పాలనలో వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. గుడివాడలో వైకాపా గంజాయి మొక్కలను ఏరేస్తామన్న ఆయన.. బూతుల సామ్రాట్‌ను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు..”గుడివాడ అంటే మహానుభావులు పుట్టినగడ్డ. ఆత్మగౌరవం నినాదంతో తెలుగువారి సత్తా చాటిన గడ్డ ఇది. ఎన్టీఆర్ అంటే తెలుగు పౌరుషం, ఆత్మగౌరవం, సంక్షేమం. గుడివాడ నుంచే ఎన్టీఆర్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే పార్టీ తెలుగుదేశం. తెదేపా-జనసేన గెలుపు అన్‌స్టాపబుల్. బ్రిటిష్ వాళ్లు వ్యాపారం పేరుతో అడుగుపెట్టి.. రాజ్యాధికారం చేపట్టారు. ఆ తర్వాత దేశంలోని సంపదంతా కొల్లగొట్టారు. అదే మాదిరిగా జగన్.. సొంత వ్యాపార సంస్థ పెట్టి ఎక్కడికక్కడ సంపదంతా దోచేస్తున్నారు. ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్ మెంట్లు.. ఎక్కడ చూసినా దోపిడీలే..ఇవన్నీ చాలవన్నట్టు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నారు. అది భూ రక్షణ చట్టం కాదు.. భూ భక్షణ చట్టం. ఇది అమల్లోకి వస్తే రాబోయే రోజుల్లో ప్రజల ఆస్తులన్నీ కొట్టేస్తారు. ఇవాళ ఓట్ల దొంగలు పడ్డారు.. భవిష్యత్తులో భూముల దొంగలు పడతారు. తెదేపా అధికారంలోకి వచ్చాక భూ రక్షణ చట్టం రద్దు చేస్తాం. పేదల ప్రభుత్వం కాదిది.. పేదల రక్తం తాగే ప్రభుత్వం. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఏమైంది? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ అయినా ప్రకటించారా? జాబు రావాలంటే తెదేపా జనసేన ప్రభుత్వం రావాలి. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. సీఎం తన సొంత చెల్లితో పాటు సీబీఐపైనా కేసులు పెట్టించారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగబోనని చెప్పారు.. చేశారా? జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. తప్పుడు, చీకటి జీవోలను వెబ్‌సైట్‌లో దాచి పెట్టారు. పద్ధతిలేని రాజకీయాలు చేసే వారి వల్ల లాభం లేదు” అని చంద్రబాబు అన్నారు..

previous post