అహోబిలంలో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం!

తన వాహనంపై, కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారంటూ ఆరోపణ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నిందితులను అరెస్టు చేయకుండా తననే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారంటూ ధర్నా

నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ:

అహోబిలం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ శాఖ వ్యవహరిస్తున్న తీరుపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాహనంపై, తన కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రౌడీషీటర్‌గా, పీడీ యాక్ట్ కేసులో ఉన్న సీసా వెంకటేశ్వర్లును గత వారం రోజులుగా హౌస్ అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను కోరుతున్నప్పటికీ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

తాను అహోబిలం వస్తున్న సమయంలో గేటు వద్ద సీసా వెంకటేశ్వర్లు అనుచరులు రాళ్లు, కర్రలతో ఉన్న విషయాన్ని ఎస్పీ, సీఐ దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. అనంతరం తన వాహనంపై, కార్యకర్తలపై దాడి జరిగినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

పోలీస్ శాఖలోని కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన పోలీసు సిబ్బందికి ఎన్నికల విధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.

అహోబిలంలో గొడవకు కారణమైన వారిని అరెస్టు చేయకుండా, తనను అరెస్టు చేస్తామని ఎస్పీ హెచ్చరిస్తున్నారని పేర్కొంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధర్నాకు దిగారు. తనను అరెస్టు చేయాలనుకుంటే ఇక్కడే సిద్ధంగా ఉన్నానని చెబుతూ అక్కడే బైఠాయించారు.

ఈ ఘటనతో అహోబిలం ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తదుపరి చర్యలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *