ప్రస్తుతం భారత్‌లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగంపై చర్చ నడుస్తోంది. అయితే, ఈ పెట్రోల్ వినియోగం కొత్తదేమీ కాదని నిపుణులు అంటున్నారు. 1970ల నాటి చమురు సంక్షోభం తరువాత ప్రపంచదేశాల్లో ఈ తరహా పెట్రోల్ వినియోగంపై ఆలోచన మొదలైంది. ఈ దిశగా బ్రెజిల్ తొలి అడుగులు వేసింది. చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహించింది.
ప్రస్తుతం బ్రెజిల్‌లో ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్) మొదలు ఈ100 (పూర్తిగా ఇథనాల్) వరకూ వివిధ పెట్రోల్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ100 వినియోగంలో ప్రస్తుతం బ్రెజిల్ ముందు వరుసలో ఉంది. ఇందు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ20 మొదలు ఈ100 వరకూ ఏ రకమైన ఇంధనాన్నైనా వినియోగించుకోగలవు.
అమెరికాలో కూడా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగంలో ఉంది. అక్కడ 10 శాతం ఇథనాల్ ఉన్న ఈ10 పెట్రోల్ సర్వసాధారణం. కొన్ని ప్రాంతాల్లో ఈ20, ఈ87.5 తరహా ఇంధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఐరోపాలో కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగుల వేస్తున్నాయి. స్వీడెన్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో ఇథనాల్ ఆధారిత పెట్రోల్ వినియోగం టాప్‌లో ఉంది.
ఇక 2023లో భారత్ ఈ20 ఇంధనాన్ని వినియోగించేందుకు నడుం కట్టింది. చైనాలో ఇప్పటికే ఈ10 రకాన్ని వినియోగిస్తున్నారు. ఈ20 వినియోగాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. థాయ్‌ల్యాండ్‌లో ప్రస్తుతం ఈ20తో పాటు ఈ85 అందుబాటులో ఉంది. కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎక్కువగా ఈ10 పెట్రోల్ అందుబాటులో ఉంది.
చెరకు నుంచి ఉత్పత్తి చేసిన ఇథనాల్‌ను ఇంధనంగా వాడటం వల్ల కర్బన ఉద్గారాలు ఏకంగా 65 శాతం మేర తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక 2025లో భారత్ ఈ20 వినియోగంతో 1.44 లక్షల కోట్ల మేర విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేసుకునే అవకాశం ఉంది.
ఇక చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తికి అయ్యే శక్తి కంటే ఏడు రెట్లు అధిక శక్తి దీన్ని మండించినప్పుడు విడుదల అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఈ తరహా ఇథనాల పర్యావరణహితకరమని చెబుతన్నారు. మొక్క జొన్న ఆధారిత ఇథనాల్‌లో ఈ తేడా 1.3 రెట్లు మాత్రమే..