వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చేందుకు భయపడుతున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. దానికి విచిత్రంగా తనకు హోదా ఇచ్చే ధైర్యం లేదని చంద్రబాబును సవాల్ చేస్తున్నారు. బుద్ది, జ్ఞానం ఉందా అని చంద్రబాబు మండిపడినా వారి డిమాండ్ మారడం లేదు. అయితే జగన్ కు హోదా లేకపోతే మేము ఎందుకు అసెంబ్లీకి వెళ్లకూడదు అని ఆరుగురు వైసీపీ సభ్యులు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆరుగురు ఎవరు అన్నది పక్కన పెడితే ఇలా అసెంబ్లీకి వెళ్తే మాత్రం జగన్ పరువు రోడ్డున పడుతుంది.
అనర్హతా వేటు పడుతుందన్న భయంలో ఎమ్మెల్యేలు.
అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతా వేటు పడుతుంది. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు ,సభకు సమాచారం ఇవ్వకుండా అరవై పని దినాలు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయవచ్చు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఒక్క రోజు హాజరు వేయించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు కానీ.. అది చెల్లదని తేలింది. తర్వాత కొంత మంది దొంగ సంతకాలు పెట్టారు.దానిపైనా స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. అవి దొంగ సంతకాలని .. అసెంబ్లీలో ఆ సభ్యులెవరూ కనిపించలేదన్నారు. తమపై అనర్హతా వేటు వేయడానికే ఇలా చేస్తున్నారన్న అనుమానం వైసీపీ ఎమ్మెల్యేలలో ఉంది.
ఈ నెలలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరు కాకపోతే.. అరవై రోజుల కోటా పూర్తయిపోతుంది. అందుకే ఆరుగురు ఎమ్మెల్యేలు తమలో తాము మాట్లాడుకుని అసెంబ్లీకి హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. తాము హాజరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాడాలని అనుకుంటున్నారు. ఈ ఆరుగురు ఎవరు అన్నది వైసీపీలో అందరికీ క్లారిటీ ఉందని చెబుతున్నారు. వారిని ఆపేందుకు ప్రయత్నిస్తారా లేకపోతే.. వెళ్తేనే మంచిదని ప్రోత్సహిస్తారా అన్నది చూడాల్సి ఉంది. తొలి సారిగా ఎమ్మెల్యేలుగా గెలిచి అధ్యక్షా అనకపోతే ఇక ఎమ్మెల్యే పదవెందుకని వారనుకుంటున్నారు.అనర్హతా వేటు పడితే జగన్ గెలవడమూ కష్టమేఅసెంబ్లీకి వెళ్లని కారణంగా అనర్హతా వేటు పడితే ప్రజలకు మొహం చూపించుకోలేరు.
ప్రజలు కూడా మరి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తారు. అందుకే ఆ కారణంతో అనర్హతా వేటు పడితే గెలవడం దాదాపు అసాధ్యం. అందుకే ఎమ్మెల్యేలు పునరాలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో కారణంతో అసెంబ్లీకి వస్తారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన రాకుండా మిగతా ఎమ్మెల్యేలు వస్తే..ఆయనపై అనర్హతా వేటు వేయడానికి స్పీకర్ పెద్దగా ఆలోచించకపోవచ్చు.