దువ్వూరులో ప్రశాంతంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలి
డీజేలు, ఆర్కెస్ట్రాలకు అనుమతి లేదు: ఎస్‌ఐ జె. ధనుంజయుడు
దువ్వూరు: మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని దువ్వూరు ఎస్‌ఐ జె. ధనుంజయుడు సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు.
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, ఆర్కెస్ట్రాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
నిమజ్జన ఊరేగింపులో ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు తదితర వాహనాలను నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. వాహనాలను జాగ్రత్తగా నడిపి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు.
విగ్రహం నిమజ్జనం పూర్తయ్యే వరకు ఉత్సవ నిర్వాహకులు, వాలంటీర్లు అక్కడే ఉండి భద్రతా చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. మండల ప్రజలు సోదరభావంతో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ సుబ్బయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది, వివిధ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: