కడప జిల్లా: పులివెందులలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఏజెంట్లను పలు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదని ఆరోపించారు.
పులివెందులలో సుమారు 70 పోలింగ్ బూత్‌లలో తమ పార్టీ ఏజెంట్లు లేకుండా చేశారని, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో చైర్‌పర్సన్ అభ్యర్థిపై దాడి చేశారని, మీడియా ప్రతినిధులపైనా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓటర్లను అడ్డుకోవడంతో పాటు ఓటర్ స్లిప్పులను చించివేస్తున్నారని పేర్కొన్నారు.
తనకు ఓటు హక్కు ఉన్న పోలింగ్ కేంద్రంలో మాత్రమే ఏజెంట్లకు అనుమతి ఇచ్చారని, ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)తో మాట్లాడినట్లు తెలిపారు.
తన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని వివరించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడేలా ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, దొంగ ఓట్లతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జగన్ ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
పులివెందులలో జరిగిన ఎన్నికల అక్రమాలపై ఎన్నికలను రద్దు చేసి, తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: