కడప: జిల్లాలో రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద యూట్యూబ్ ఛానళ్ల పేరుతో అనవసర హడావుడి సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించేందుకు ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డుతో పాటు ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రత్యేక అనుమతి పత్రం (పాస్) కలిగిన జర్నలిస్టులకు మాత్రమే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లాలోని పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, నిబంధనలను ఉల్లంఘించి పోలింగ్ కేంద్రాల వద్ద హద్దులు దాటినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: