వేరు వేరు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న సిఎం
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన చెందారు.పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుతాళ్ళ గ్రామంలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గణేష్ విగ్రహ ఊరేగింపులో ట్రాక్టర్ దూసుకుపోయిన ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయాల పాలయ్యారు.ఎంతో సంతోషంగా వేడుక జరుపుకుంటున్న వారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు చింతలవీధి జంక్షన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు వివరించారు.వారికి అందుతున్న వైద్య సహాయంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.