నువ్వు నల్లగా ఉన్నవ్.. ఈ క్రీమ్ తెల్లగా చేస్తుంది.. అంటూ భార్య శరీరంపై యాసిడ్ పోశాడు భర్త. ఆ తర్వాత మండుతున్న అగరుబత్తీలతో శరీరంపై కాల్చడం ప్రారంభించాడు.దీంతో అప్పటికే వేసిన యాసిడ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి వివాహిత మంటల్లో కాలిపోయింది. కాసేపటికే చనిపోయింది. 2017 జూన్ 24 రాత్రి జరిగిన ఈ ఘటన ఇప్పటికీ ఉదయ్‌పూర్ ప్రజలను కలవరపెడుతుంది. కాగా ఈ కేసును విచారించిన మావ్లీ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. భార్య లక్ష్మిని హత్య చేసిన కిషన్ లాల్‌కు మరణశిక్ష విధించింది.ఘటన జరిగిన రోజు రాత్రి నిందితుడు భార్య ఒంటిపై ఓ కెమికల్ రాశాడు. ఈ మందు తెల్లగా మారుస్తుందని నమ్మించాడు. కానీ అది యాసిడ్ వాసన వస్తుందని పసిగట్టేలోపే.. ఆమె పొట్టపై మండుతున్న ధూపం వేసి, మిగిలిన మందు కూడా పోశాడు. దీంతో లక్ష్మి మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం 14 మంది సాక్ష్యం చెప్పగా.. నిందితుడికి వ్యతిరేకంగా 36 డాక్యుమెంట్లతో కూడిన ఆధారాలను సమర్పించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేష్ చంద్ర పాలివాల్. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రిసైడింగ్ అధికారి జస్టిస్ రాహుల్ చౌదరి కఠిన స్వరంతో తీర్పు వెలువరించారు. ‘ఈ నేరం కేవలం మహిళ హత్య కాదు, ఆత్మను ఛిన్నాభిన్నం చేసే నేరం. అలాంటి వ్యక్తికి పునరావాసం కల్పించడం సాధ్యం కాదు కాబట్టి మరణశిక్ష విధిస్తున్నాం’ అని తెలిపారు.
