కడప /మైదుకూరు :బ్రహ్మంగారిమఠం మండలంలోని మహా గురుకులంలో 9వ తరగతి విద్యార్థి స్టీవెన్ గత మూడు రోజులుగా తీవ్ర విషజ్వరంతో బాధపడుతున్నప్పటికీ, పాఠశాల సిబ్బంది సరైన శ్రద్ధ చూపలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆలస్యంగా మాత్రమే విద్యార్థి తండ్రికి సమాచారం అందించడంతో, విద్యార్థి నానమ్మ తక్షణమే పాఠశాలకు చేరుకొని స్టీవెన్‌ను బ్రహ్మంగారిమఠం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే విద్యార్థి పరిస్థితిని తెలుసుకోకుండానే పాఠశాల సిబ్బంది వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు వాపోయారు. రాత్రి ఆసుపత్రిలో విద్యార్థి తల్లి ఒక్కరే ఉండటంతో కుటుంబం ఆందోళన చెందుతోంది.
ఈ ఘటనపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మండల కార్యదర్శి గండి సునీల్‌కుమార్, SFI మండల కార్యదర్శి రాజశేఖర్, మండల అధ్యక్షుడు అరవింద్, DYFI జిల్లా ఉపాధ్యక్షుడు రబ్బా నరసింహులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థి ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు.