పులివెందుల, సురభి నాటకోత్సవాలను విజయవంతం చేయాలని ఓ ఎస్ డి అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నగరవనం (రాణి తోపు) లో సురభి నాటకోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ లను ఆర్డిఓ వెంకటేశ్వర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓ ఎస్ డి మాట్లాడుతూ… జనవరి 13. నుంచి 18. వరకు నిర్వహించే నాటకోత్సవాలను కుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందించాలని కోరారు. నాటకం అంటే సురభి… సురభి అంటే నాటకం అనేలా ప్రఖ్యాతగాంచిన నాటకోత్సవాలను వినాయక నాట్యమండలి ఆధ్వర్యంలో గరండాల రివర్ ఫ్రంట్ లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించుకోవడం విశేషం అన్నారు. సురభికి పుట్టినిల్లు అయిన పులివెందులలో ఈ నాటక ప్రదర్శనలు ఇవ్వడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చన్నారు. సినిమా చూస్తున్నట్లు ఈ నాటక ప్రదర్శనలు ఇవ్వడం సురభి కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం అని తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .
