తమిళనాడు ప్రభుత్వానికి కీలక సూచన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది.దేశంలో మరో నెలరోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంలా బయటకు తీసింది. వాస్తవానికి సీఏఏ చట్టం -2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. అయితే, విపక్షాల ఆందోళనలు, దేశ వ్యాప్తంగా నిరసనల కారణంగా అమల్లో జాప్యం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయంలో సీఏఏను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. కేంద్రం నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఏఏపై తమిళినాడు స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ స్పందించారు.సీఏఏపై తమిళ నటుడు, టీవీకే నేత విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రజలందరూ మత సామరస్యంతో జీవిస్తున్న వాతావరణంలో.. విభజన రాజకీయాల స్ఫూర్తితో అమలు చేస్తున్న భారత పౌరసత్వ సవరణ చట్టం-2019 ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయబోమని పాలకులు పాలకులు హామీ ఇవ్వాలని విజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీ పెట్టిన విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పోటీచేయదని, ఎవరికీ మద్దతు ఇవ్వదని విజయ్ చెప్పారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
