నేడే విడుదల.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. శనివారం మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో.. లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఇప్పటికే.. ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభల ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనుంది. అయితే, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారా.. లేదా? అనేది తేలాల్సి ఉంది.కాగా.. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 16తో ముగియనుంది. అప్పటిలోగా కొత్త సభ ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు కూడా ఈ ఏడాది మే లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిలో భాగంగా.. ఎన్నికల సంఘం.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించింది. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు జరిపి షెడ్యూల్‌ను సిద్ధం చేసింది.లోక్ సభ.. పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగానే.. దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఈ ప్రవర్తనా నియమావళి దేశమంతటా అమల్లో ఉండనుంది. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కఠిన నిబంధనలను అమలు చేయనుంది.గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్.. 2019 మార్చి 10వ తేదీన విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైన పోలింగ్, మే 19 వరకు ఏడు విడతల్లో జరగగా.. 2019 మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి (2024 ఎన్నికలు) కూడా ఏప్రిల్-మే నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
