పట్టా భూమిపై అధికారుల కన్ను.. రాజకీయ ఒత్తిళ్లతో ఆక్రమణ యత్నమా?

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దువ్వూరు: కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన గోపిరెడ్డి వీరశంకర్‌రెడ్డి తన పట్టా భూమిని రాజకీయ ఒత్తిళ్లతో ప్రభుత్వ భూమిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

బాధితుడి వివరాల ప్రకారం, సర్వే నంబర్లు 89, 90, 91 (LPM No.728)లోని 1.53 ఎకరాల పట్టా భూమి తమ కుటుంబానికి చెందినదని, విభజన పత్రాలు, పట్టాదారు పాస్‌బుక్, 1-బి రిజిస్టర్, అడంగల్ తదితర రికార్డులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

ఈ భూమికి ఆనుకుని సర్వే నంబర్ 114 (LPM No.738)లో ప్రభుత్వ చెరువు కట్ట భూమి ఉందని, అదే భూమిలో ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో శ్మశానవాటిక నిర్మాణం జరగాల్సి ఉండగా, అధికారులు తమ పట్టా భూమిలోనే నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.ఈ విషయంపై అభ్యంతరం తెలిపినా అధికారులు స్పందించకపోవడంతో 2025లో మైదుకూరు సివిల్ కోర్టులో O.S. No.158/2025 దాఖలు చేసినట్లు చెప్పారు. అలాగే కలెక్టర్‌కు గ్రీవెన్స్ ద్వారా పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు పంపి నిర్మాణం ప్రభుత్వ భూమిలోనే జరుగుతోందని చూపించారని ఆరోపించారు.

2026లో డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో మళ్లీ సర్వే నిర్వహించి హద్దురాళ్లు పాతించినప్పటికీ, అనంతరం రాజకీయ ఒత్తిళ్లతో వాటిని తొలగించి అసంపూర్ణ నివేదిక సమర్పించారని తెలిపారు. అంతేకాక, రీ-సర్వేలో ప్రభుత్వ భూమి విస్తీర్ణాన్ని 2.37 ఎకరాల నుంచి 2.54 ఎకరాలకు పెంచి, తమ భూమిని తగ్గించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.

అదేవిధంగా, పాత ఎఫ్‌ఎంబీ (FMB) రికార్డుల్లో 186 లింకులను 212 లింకులుగా అనధికారికంగా మార్చారని, దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా తమకు తెలియదని సమాధానం ఇచ్చారని బాధితుడు తెలిపారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుని తన పట్టా భూమిని కాపాడాలని గోపిరెడ్డి వీరశంకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

(గమనిక: ఇవి బాధితుడు చేసిన ఆరోపణలు మాత్రమే. సంబంధిత ప్రభుత్వ అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *