పులివెందుల పట్టణంలోని న్యాక్ బిల్డింగ్ ఎదురుగా 20 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విపశ్యన ధ్యాన కేంద్రాన్ని ఆదివారం డాక్టర్ వైయస్ సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విపశ్యన అంటే శ్వాసపై ధ్యాస ఉంచడం అని అందువల్ల మన మనస్సు పై ఏకాగ్రత పెరిగి రోజువారి దైనందిన జీవితంలో ఎదురై ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఒక మంచి మార్గంలో పయనించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా చాలామంది ధ్యానం అంటే ముసలి వారు చేసేదని అపోహపడుతుంటారని అన్నారు. ధ్యానం అనేది ఏ ఒక్క కులానికి మతానికి వయస్సుకు సంబంధించినది కాదని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం వల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారని అందువల్ల అనారోగ్యానికి గురవుతూ చదువు మీద ఏకాగ్రత కోల్పోతున్నారని అటువంటి వారు విపశ్యన లో చేరి ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఈ కోర్స్ పది రోజుల వరకు ఉంటుందని ఎటువంటి ఫీజు ఉండదని వచ్చిన వారికి వసతి భోజనం ఉచితంగా ఇక్కడే ఏర్పాటు చేస్తారని తెలిపారు. ధ్యాన కేంద్రంలో చేరేందుకు www.dhamma.org అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.
