సీఎంను ప్రశ్నించేందుకు ప్రయత్నించిందని.. జర్నలిస్టులపై పోలీసుల దాడి ఆరోపణలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై పోలీసుల దాడి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన 4PM న్యూస్ నెట్‌వర్క్‌కు చెందిన జర్నలిస్టులు షాహీన్ ఖాన్, నఫీసా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వారు ఆరోపించారు.సాకేత్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తాను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన సమయంలో తమను పోలీసులు అడ్డుకుని సాకేత్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని జర్నలిస్టులు తెలిపారు. అక్కడ తమపై దాడి చేశారని, దుర్భాషలాడారని వారు ఆరోపించారు.తమ పేర్లు, మతపరమైన గుర్తింపు గురించి పోలీసులు ప్రశ్నించారని.. తాము ముస్లింలమని తెలిసిన తర్వాత దాడి మరింత తీవ్రతరం అయిందని షాహీన్ ఖాన్ ఆరోపించారు. తమ శరీరాలపై గాయాలను చూపిస్తూ ఆమె విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నఫీసా ఖాన్ తీవ్రంగా గాయపడి నడవలేని పరిస్థితిలో కనిపించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.అయితే జర్నలిస్టుల ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. వీఐపీ రూట్‌కు అడ్డంకి కలిగించడం, పోలీసుల సూచనలను పాటించకపోవడం, అక్కడ వాగ్వాదం జరగడంతో వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. జర్నలిస్టులపై దాడి, మతపరమైన వివక్ష ఆరోపణలు వాస్తవ విరుద్ధమైనవని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ సహా పలు జర్నలిస్టు సంఘాలు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
జర్నలిస్టులను ప్రశ్నలు అడిగినందుకే కొట్టారా? లేక వీఐపీ భద్రతా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు చెప్పిన కారణమే నిజమా? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: