### బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే సూచనలు
### ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మత్స్యకారులకు హెచ్చరిక
**అమరావతి, అక్టోబర్ 23:** ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అనంతరం వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
### వాతావరణ హెచ్చరికలు
– శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
– ఆదివారం నాటికి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారవచ్చని అంచనా.
– ఆ తర్వాత మూడు రోజుల్లో మరింత బలపడి కోస్తాంధ్ర తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయి.
– తమిళనాడు, కేరళ ప్రాంతాల్లోని అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
– శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
– సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
– కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
– తీర ప్రాంతాల్లో గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది
### ప్రజలకు సూచనలు
– వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల హెచ్చరికలను పాటించాలి.
– భారీ వర్షాలు కురిసే సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు.
– పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు.
– తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
– సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలి.
– అధికారుల నుంచి తదుపరి సమాచారం వచ్చే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు.
Save or share this story as a newspaper-style Epaper Clip: