రేపు తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
నెల్లూరు – నరసాపురం మధ్య తీరం దాటే సూచనలు.. మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
అమరావతి, నవంబర్ 1:
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుపాను వేగంగా కదులుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 27 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమాచారం ప్రకారం తుపాను చెన్నైకి 480 కిలోమీటర్లు, నెల్లూరుకు 550 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 560 కిలోమీటర్లు, ఒంగోలుకు 600 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
తుపాను సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు – నరసాపురం ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
అదేవిధంగా నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ముందస్తుగా సహాయక బృందాల ఏర్పాటు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు ముందస్తుగా 6 ఎన్‌డీఆర్‌ఎఫ్, 7 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
తుపాను నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అధికారుల సూచనలు పాటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాల సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: