శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో టూరిజంలో రూ.400 కోట్ల స్కాం స్కాంలో మాజీ మంత్రి రోజా పాత్ర
జనసేన నేత కిరణ్ రాయల్‌తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో, వైసీపీ హయాంలో టూరిజం శాఖలో రూ.400 కోట్ల స్కాం జరిగిందని జనసేన తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో టూరిజం శాఖలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని, తద్వారా వందల కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపించారు. శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో (టూర్ ప్యాకేజీ) గతంలో 24 బస్సులకు పర్మిషన్ ఇస్తే, అందులో తిప్పింది ఆరేడు బస్సులు మాత్రమేనని చెప్పారు. అన్ని బస్సులనూ తిప్పినట్లు, హోటల్లో రూములు బుక్ చేసినట్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. సాధారణంగా చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, ఇలా ప్రధాన ప్రాంతాల నుంచి మాత్రమే టూర్ ప్యాకేజీలు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వంలో రాయచోటి, కడప ప్రాంతాల నుంచీ టూర్ ప్యాకేజీలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ ట్రావెల్స్ బస్సులన్నీ వైసీపీకి చెందిన మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అనుచరులవేనని ఆరోపించారు. టూరిజం శాఖలో స్కాంలకు సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వీటిని టూరిజం శాఖ మంత్రికి, ఎండీకి, సీఐడీకి అందజేస్తామని చెప్పారు. ఈ స్కాం వెనుక మాజీ మంత్రి రోజా, ధనుంజయ రెడ్డి బంధువైన విశాఖపట్నంలో టూరిజం భవనం నిర్మించిన మల్లారెడ్డి, తిరుపతిలో పని చేసిన డీవీఎంలు ఉన్నారని ఆరోపించారు. ఈ అవినీతి అధికారి(డీవీఎం)తిరుపతి నుంచి ఎలా రిలీవ్ అయ్యాడో అర్థంకావడం లేదన్నారు. టూరిజం శాఖలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సీఐడీ ఎంక్వయిరీ వేయిస్తామని స్పష్టం చేశారు. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అవినీతి వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులను అరెస్టు చేయాలని, ఆ డబ్బు రికవరీ చేసి శ్రీవారి హుండీలో వేయాలని కోరుతున్నామన్నారు.