రైల్వే కోడూరు పరిధిలోని ఎం.బావి వద్ద జాతీయ రహదారిలో కారులో తరలిస్తున్న 6ఎర్రచందనం దుంగలతో పాటు కారును స్వాధీనం చేసుకుని, ఒకరిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ జి. బాలిరెడ్డి సూచనల మేరకు కడప సబ్ కంట్రోల్ కు చెందిన ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ పి. నరేష్, అటవీ శాఖకు చెందిన ఎఫ్ బీఓ నాగేశ్వర్ నాయక్ బృందాలు శనివారం ఉదయం తిరుపతి-కడప జాతీయ రహదారిలో రెడ్డిపల్లి చెరువు సమీపంలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. తనిఖీలను చూసి, ఒక కారులోని ఇద్దరు వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నించగా టాస్క్ ఫోర్సు పోలీసులు ఒకరిని పట్టుకోగలిగారు. అతనిని కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారులో దాచి ఉంచిన ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని, ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఎస్ఐ సీహెచ్ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

previous post