ఏపీలో కూటమి ప్రభుత్వం పక్షాన ఇచ్చిన ‘సూపర్-6’ హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని గత గురువారం ప్రారంభించారు. శుక్రవారం, శనివారాల్లో లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో రూ.13000 చొప్పున నిధులు జమ చేశారు. ఇంట్లో ఒక తల్లికి ఎంత మంది చదువుకునే చిన్నారులు ఉన్నా.. వారందరికీ ఈ సొమ్ములు జమ చేస్తామని చెప్పినట్టుగానే.. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. దాదాపు 85 శాతం మందికి ఈ నిధులు ఇచ్చేశారు.కుటుంబంలో ముగ్గురు పిల్లలున్నా..చివరకు అయిదుగురు పిల్లలు ఉన్నా.. నిధులు ఇచ్చారు. సహజంగా నే ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు.. ప్రభుత్వం క్రెడిట్ కోరుకోవడంలో తప్పులేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అదే పనిచేశారు. ఆదివారం పార్టీ నాయకులకు ఆయన ఫోన్ చేసి.. ప్రజల సంతృప్తి ఎలా ఉందన్నది ఆరా తీశారు. మహిళల ఆనందాన్ని తెలుసుకున్నారు. తల్లికి వందనం పథకంపై ఆనందం ఎలా ఉందని ప్రశ్నించారు. మొత్తంగా క్షేత్రస్థాయిలో పరిస్తితిని ఆయన అడిగి విచారించారు.ఈ సందర్భంగా ఎక్కువ మంది ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే.. గ్రామీణ భారతంలో సర్పంచులు, వార్డు మెంబర్ల పిల్లలకు ఈ పథకం చేరకపోవడాన్ని తమ్ముళ్లు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. వైసీపీ హయాంలో వారికి కూడా అందిందని.. ఇప్పుడు వారిని తప్పించారని చెప్పారు. దీనిపై చంద్రబాబు సరిచూస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక, పట్టణాలు, నగరాల్లో కూడా.. లబ్ధిదారుల సంఖ్యను కుదించడంపై తమ్ముళ్లు వివరాలు సమర్పించారు.300 యూనిట్ల విద్యుత్ వినియోగం చేసిన వారిని ఈ పథకం నుంచి తప్పించారు. అలాగే.. నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారిని కూడా తీసేశారు. ఈ విషయంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. వీరికి వేరే రూపం లో అయినా.. ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు. పైగా.. తెల్లరేషన్ కార్డును కొలమానంగా తీసుకున్నా.. వారిలో కూడా చాలా మందికి ఈ పథకం చేరలేదని చెప్పుకొచ్చారు. ఒకవైపు సంతృప్తి ఉందని చెబుతూనే.. మరోవైపు.. లోపాలను కూడా ఎత్తి చూపారు. ఈ పరిణామాలపై చంద్రబాబు చర్చిస్తానని హామీ ఇవ్వడం గమనార్హం.

previous post
next post