సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు రైతులు రాస్తా రోకో

ఒంగోలు, జూలై 30: పొగాకు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు సమీపంలోని టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులను, రైతు నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ… పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ₹1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌టీసీ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు కిలోకు కనీసం ₹250 చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి కిలోకు ₹200 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవద్దని సూచించినప్పటికీ అమలు జరగలేదని రైతులు ఆరోపించారు. ‘నో బిడ్’, ‘లో బిడ్’ కారణంగా ఒక్కో బారెన్‌కు ₹5 లక్షల నుంచి ₹6 లక్షల వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *