పులివెందులలో పోలింగ్ ఏజెంట్లను ఎవరూ అడ్డుకోలేదు హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతులపై ఎలాంటి గందరగోళం లేదు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు.. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప నవంబర్ 1:

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, పులివెందులలో పోలింగ్ ఏజెంట్లను అధికారులు ఎక్కడా అడ్డుకోలేదని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతుల విషయంలోనూ ఎలాంటి గందరగోళం లేదని వెల్లడించారు.

ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలపై వాస్తవాలను వివరించారు.

**హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతులు ఇచ్చాం

మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ పులివెందులకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటుందని తొలుత సమాచారం అందడంతో అక్టోబర్ 27వ తేదీనే ల్యాండింగ్‌కు అనుమతులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అయితే ఆదివారం ఉదయం 10 గంటలకే హెలికాప్టర్ వస్తుందని సమాచారం రావడంతో, శాంతిభద్రతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలుత మధ్యాహ్నం 3 గంటలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం హెలికాప్టర్ అప్పటికే గాలిలోకి ఎగిరినట్లు సమాచారం రావడంతో ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ఉదయం 9.45 గంటలకు ల్యాండింగ్‌కు అనుమతించామని వివరించారు. హెలికాప్టర్‌ను వెనక్కి వెళ్లాలని లేదా మరో ప్రాంతానికి మళ్లించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

47 మంది పోలింగ్ ఏజెంట్ల నమోదు

పులివెందులలో పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. పట్టణంలోని 80 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఉదయం 7 గంటలలోపే 47 మంది ఏజెంట్లు అవసరమైన గుర్తింపు పత్రాలతో నమోదు చేసుకుని విధుల్లో పాల్గొన్నారని తెలిపారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య కొంతమంది ఏజెంట్లు వ్యక్తిగత కారణాలతో కేంద్రాల నుంచి వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. ఏ ఒక్క ఏజెంట్‌ను అధికారులు అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

**వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ**

పులివెందులలోని అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపినట్లు లేదా దౌర్జన్యానికి పాల్పడినట్లు ఎలాంటి ఘటనలు రికార్డు కాలేదన్నారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులకు కూడా ఈ తరహా ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు.

**50 శాతం పోలింగ్ నమోదు**

జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 560 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లావ్యాప్తంగా సుమారు 50 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. కొన్ని శాంతిభద్రతలకు సంబంధించిన ఘటనలు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వెలుపల జరిగినప్పటికీ, పోలింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదన్నారు.

**నిర్భయంగా ఓటు వేయండి**

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నిరాధార ప్రచారాలను నమ్మి అయోమయానికి గురికావద్దని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *