Tv424x7
Andhrapradesh

నగరంలో అతిసారవ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు చేపట్టండి – జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ

విశాఖపట్నం నగర పరిధిలో అతిసారవ్యాధి ప్రబలకుండా పటిష్టమైన జాగ్రత్తలతో కూడిన చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ సిఎం. సాయికాంత్ వర్మ జివిఎంసి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టిన స్టాప్ డయేరియా ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో అతిసార వ్యాధి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు నియంత్రణా చర్యలపై ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో జివిఎంసి అదనపు కమిషనర్ (డెవలప్మెంట్) కె.ఎస్. విశ్వనాధన్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అతిసారవ్యాధితో పాటు మలేరియా, డెంగ్యు, ఇతర సీజనల్ వ్యాధులు నగరంలో ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డిసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ కార్యక్రమం ముమ్మరంగా చేపట్టాలని, నగరంలో 1019 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన గెడ్డల్లోని పూడికలు తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను, అలాగే 2890 కిలోమీటర్ల మేర ఉన్న చిన్న కాలువలలో పూడికలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ప్రజా ఆరోగ్య విభాగ అధికారులను కమీషనర్ ఆదేశించారు. జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగాల సమన్వయంతో నగర పరిధిలో ఉన్న బి.ఆర్.టి.ఎస్. కారిడార్లలో, హైవే రోడ్లపై, బీచ్ రోడ్డులలో వర్షపు నీరు నిల్వ ఉండబోయే ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నీటి సరఫరా విభాగం, పబ్లిక్ వర్క్స్ విభాగం సహాయక ఇంజనీర్లు వారి పరిధిలోని గల మురుగు నీటి కాలువలు, కల్వర్టులు గుండా వెళ్ళే తాగునీటి పైపులను మూడు రోజుల్లో గుర్తించి వాటి లీకులను అరికట్టే చర్యలను చేపట్టాలని పర్యవేక్షక ఇంజనీర్లను కమీషనర్ ఆదేశించారు. జోన్ వారీగా వున్న 246 ఇ.ఎల్.ఎన్.ఆర్., జి.ఎల్.ఎస్.ఆర్. నీటి ట్యాంకులను, పరిశుభ్ర పరచాలని, నీటి నాణ్యత పరీక్షలు చేపట్టాలని, సచివాలయ వాలంటీర్ల ద్వారా కాలనీలకు వెళ్ళే నీటి సరఫరా లో క్లోరిన్ టెస్ట్ నిర్వహించే చర్యలు చేపట్టాలన్నారు.అలాగే 682 కిలోమీటర్ గల ప్రధాన రోడ్లలో, అంతర్భాగ రోడ్లలో భూగర్భ డ్రైనేజిల యందు సిల్ట్ లను తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గార్బేజ్ వల్నరబుల్ ప్రదేశాలను గుర్తించి వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని, ప్రజా మరియు సామాజిక మరుగుదొడ్లలో డ్రైనేజీ, నీటి సరఫరా, పరిశుభ్రత మొదలైన మౌలిక వసతులను పరిశీలించి నివేదిక సమర్పించాలని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ ను ఆదేశించారు.చిన్నపిల్లలలో అతిసార వ్యాధి సోకే అవకాశం ఉన్నందున సచివాలయాల పరిధిలో వాలంటీర్ల ద్వారా ఐదు సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి నివేదిక సమర్పించాలని డిపిఒ ఎం.వి.డి. ఫణిరాంను కమీషనర్ ఆదేశించారు. వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందకుండా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని, ప్రతి వారం తప్పని సరిగా కాలువలలో స్ప్రేయింగ్, వీధులలో, కాలనీలలో ఫాగింగ్, చెరువులలో గంబుషియా చేపల విడుదల, తదితర కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి ఇంటా దోమలు వృద్ది చెందే ప్రదేశాలు గుర్తించి, వారంలో ఒక రోజు విధిగా “డ్రై డే” పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ఈ సమీక్షా సమావేశంలో జివిఎంసి అదనపు కమిషనర్లు డాక్టర్ వై.శ్రీనివాసరావు, ఎస్.ఎస్.వర్మ, డాక్టర్ వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజనీర్ రవి కృష్ణంరాజు, పర్యవేక్షక ఇంజనీర్లు, జోనల్ కమిషనర్లు, కార్యనిర్వహక ఇంజనీర్లు, యుసిడి ప్రాజెక్టు ఆఫీసర్, డిపిఓలు, బయాలజీస్టు, ఏఎంఓహెచ్ లు, ఏపీడీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

బాణసంచా గోడౌన్లను అన్నింటికీ లైసెన్సులు ఉన్నాయా లేదా పరిశీలించండి

TV4-24X7 News

కేరళలో అడిషనల్ కోర్ట్ సంచలన తీర్పు.. 15 మందికి మరణ శిక్ష

TV4-24X7 News

సింగనమల సీఐ కౌలుట్లయ్య మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి

TV4-24X7 News

Leave a Comment