లండన్: ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దాడుల కారణంగా గాజాలో వేలాది మంది మరణించారు. అయితే సాధ్యమైనంత త్వరగా గాజా ప్రాంత ప్రజలకు సహాయక చర్యలు అందించాలని యునైటెడ్ నేషన్స్ ఆకాంక్షించింది.అలా కాకుంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. వారికి సహాయం అందకుంటే.. మరో 48 గంటల్లో దాదాపు 14 వేల మందికిపైగా చిన్నారులు మరణిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ హ్యుమన్‌టేరియన్ చీఫ్ టామ్ ఫ్లెచర్ వెల్లడించారు. చిన్నారులకు ఆహారం తీసుకు వెళ్తున్న ఐదు ట్రక్కులు గాజా ప్రాంతంలోకి ఇప్పటికే ప్రవేశించాయని తెలిపారు. ఇవి వారికి చేరకుంటే.. వారు మరణిస్తారన్నారు. ఇప్పటికే వారంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వీరి కోసం మరిన్ని ట్రక్కుల ఆహారం గాజాలోకి తీసుకు వెళ్తామని ఆయన తెలిపారు. రానున్న 48 గంటల్లో ఈ 14 వేల మంది చిన్నారులు యునైటెడ్ నేషన్స్ రక్షించాలనుకొంటుందని టామ్ ఫ్లెచర్ పేర్కొన్నారు.గాజాలోని తమకు బలమైన బృందాలు పని చేస్తున్నాయన్నారు. ఈ బృందాలు వైద్య కేంద్రాలు, పాఠశాలలో పని చేస్తున్నాయని సోదాహరణగా వివరించారు. స్థానిక పరిస్థితును వారు అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే వీరిలో చాలా మంది చంపబడ్డారని ఈ సందర్భంగా టామ్ ఫ్లెచర్ ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిపై బ్రిటన్, ప్రాన్స్, కెనడా నేతలు ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. గాజాకు మానవాతా సహాయంపై విధించిన ఆంక్షలు ఎత్తివేయకుంటే.. సంయుక్తంగా ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకుంటామని ఆయా దేశాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. అలాగే ఇజ్రాయెల్‌లోని నెతన్యాహు ప్రభుత్వంలో మంత్రుల చేసిన వ్యాఖ్యలపై సైతం ఈ మూడు దేశాలు మండిపడ్డాయి. అయితే యూఎస్ హ్యుమన్‌టేరియన్ చీఫ్ టామ్ ఫ్లెచర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించారు. గాజాలో పరిస్థితులు మీకు ఎలా తెలిశాయని సదరు మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. టాప్ ఫ్లెచర్ వివరించారు.ఇటీవల ఖతార్‌లోని దోహాలో కాల్పుల విరమణ, బందీల అప్పగింతపై చర్చలు జరుగుతోన్నాయి. ఇందులో అమెరికా, ఈజీప్టు, ఖతార్ మధ్య వర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 ట్రక్కుల సహాయం అందించాలంటూ పలు ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. అయితే గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. హమాస్ నిరాయుధీకరణ దిశగా అడుగులు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహ్యు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్ సైన్యం.. గాజా స్ట్రిప్‌లో తాజాగా ఆపరేషన్ గిడియన్స్ చారియట్ పేరుతో కొత్తగా సైనిక దాడికి శ్రీకారం చుట్టింది. గాజాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల కారణంగా వందలాది మంది మరణించారు. వీరిలో చిన్నారులు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై బ్రిటన్, ప్రాన్స్, ఈజిప్టులు కాస్గా ఘాటుగా స్పందించాయి.

previous post
next post