ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్ లో బిజీబిజీగా గడిపారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆయన పటాన్ చెరు ప్రాంతంలో కనిపించారు. పటాన్ చెరును ఆనుకుని ఉన్న ఇక్రాశాట్ లో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ఐఎస్ హెచ్) ను ఆయన సందర్శించారు. స్కూల్ ప్రాంగణానికి చేరుకున్న పవన్ కు పాఠశాల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది.అయినా పవన్ ఇప్పుడు ఎందుకని స్కూళ్ల బాట పట్టారనేగా మీ అనుమానం? అది కూడా హైదరాబాద్ లోని టాప్ మోస్ట్ కార్పొరేట్ పాఠశాలలో పవన్ పర్యటన అంటే అందరి దృష్టి అటే మళ్లింది. వాస్తవానికి పటాన్ చెరు, శంకర్ పల్లి పరిసరాల్లో అంతర్జాతీయ స్థాయి స్కూళ్లు, కాలేజీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో అడ్మిషన్ల కోసం ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ప్రముఖులు ఈ ప్రాంతాల్లో తచ్చాడుతూ ఉంటారు. తమ పిల్లలను ఆయా విద్యాలయాల్లో చేర్పించేందుకు వారు ఈ పర్యటనలు సాగిస్తూ ఉంటారు.పవన్ కూడా శుక్రవారం ప్రజా ప్రతినిధి, పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం వంటి పదవులను కాసేపు పక్కనపెట్టి… తండ్రి బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ను స్కూల్లో వేసే దిశగా పవన్ చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం ఐఎస్ హెచ్ ను సందర్శించినట్లు సమాచారం. ఇదే స్కూల్లో తన కుమారుడిని ఆయన చేరుస్తారో, లేదో తెలియదు గానీ… విద్యా బోధనతో పాటు భద్రతా పరంగా టాప్ మోస్ట్ స్కూళ్ల జాబితాను పట్టుకుని పవన్ రంగంలోకి దిగినట్లు సమాచారం.వాస్తవానికి ప్రముఖులు ప్రత్యేకంచి రాజకీయ ప్రముఖులు తమ పిల్లలు ఎక్కడ విద్యనభ్యసిస్తున్నారన్న విషయంపై వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు. భద్రతా కారణాల రీత్యా ఇది తప్పనిసరి కూడా. అయితే పవన్ కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తారా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే… ఐఎస్ హెచ్ లోనే తన కుమారుడిని అయితే చేరుస్తున్నానని ఆయన ప్రకటించలేదు. కేవలం ఆ పాఠశాల పరిసరాలను మాత్రమే ఆయన పరిశీలించినట్లు సమాచారం. మరిన్ని పాఠశాలలను పరిశీలించిన తర్వాత గానీ మార్క్ శంకర్ ను ఏ పాఠశాలలో చేర్చాలో పవన్ నిర్ణయించనున్నారు.

previous post
next post