తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందని ఏఐసీసీ అధ్యక్షులు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. దేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చాలా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.కానీ వాళ్లు ఈ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ 42 దేశాలు తిరిగారని గుర్తు చేశారు. కానీ ప్రజలు చనిపోతున్నా.. మణిపూర్ రాష్ట్రానికి మాత్రం ఆయన వెళ్లలేదని మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ఏదేదో చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించారన్నారు. కానీ ఎందుకు ఏం చేయలేదని మోదీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు..!!

previous post