ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎంతమంది విజయవంతం చేశారు?
ఎంత మంది ఇంటికే పరిమితమయ్యారు? అంటే.. చాలా మంది ఫెయిలయ్యారన్నది చంద్ర బాబుకే అందిన నివేదిక తేల్చి చెబుతోంది. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే సహా.. ఇతర మాధ్యమాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా విజయవంతం చేశారన్న విషయాన్ని సీఎం చంద్రబాబు తెలుసుకున్నా రు. దీని పై ఒకటి రెండు నివేదికలు కూడా తెప్పించుకున్నారు.ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన తొలి తరం ఎమ్మెల్యేల నుంచి సీనియర్ల వరకు కూడా ఈ కార్యక్రమంలో ఏమేరకు భాగస్వామ్యం అయ్యారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. దీనిలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికి ఈ కార్యక్రమం చేపట్టి 20 రోజులు అవుతున్నాయి. సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వెళ్లి.. ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించాలన్న సీఎం చంద్రబాబు ఉద్దేశం. వైసీపీ వ్యతిరేకత ప్రచారాన్ని తగ్గించాలన్నది కూడా బాబు వ్యూహం.అయితే.. ఈ ఉద్దేశాన్ని కొత్తతరం నాయకులు చాలా వరకు నెరవేర్చలేకపోయారన్నది తాజాగా వచ్చిన నివేదిక తేటతెల్లం చేసింది. కొందరు ఒకటి రెండు మాత్రమే మొక్కబడిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొందరు.. తమకు ఇతర వ్యాపకాలు ఉన్నాయన్నట్టుగా వ్యవహరించారు. దీంతో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేల్లో 15 మంది వరకు వెనుకబడ్డారని సమాచారం. మరో 20 మంది అసలు ఈ రేసులో పాల్గొనలేదని.. కార్యక్రమాలను లైట్ తీసుకున్నారని పార్టీకి సమాచారం వచ్చింది.అయితే..వారెవరు? అనే విషయాన్ని పార్టీ అధిష్టానం నుంచి నాయకుల వరకు కూడా అందరూ గోప్యంగా ఉంచారు. ఎవరూ బయటకు వెల్లడించడం లేదు. దీనికి కారణం.. వీరిని చూసి మిగిలిన వారు కూడా నేర్చుకుంటారన్న భావన ఉండి ఉంటుందన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా.. చంద్రబాబు ఏ స్పూర్తితో అయితే.. ఈ కార్యక్రమాన్ని చేపట్టారో.. దానిని నెరవేర్చడంలో నాయకులు విఫలమవుతున్నారన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెల చివరిలో చంద్రబాబు పార్టీ నాయకులతో భేటీ అయి.. సీరియస్‌గానే వారికి విషయాన్ని చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.