వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకిదిల్లీ: ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఆదాయపు పన్ను చట్టం-1961ని ఇది భర్తీ చేయనుంది.ఆదాయపు పన్ను చట్టం-2025 వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే, 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది పన్ను చట్టాలను మరింత సులభతరం చేయనుంది. ‘ఆదాయపు పన్ను చట్టం-2025 రాష్ట్రపతి ఆమోదం పొందింది. సరళమైన, పారదర్శకమైన, అనుకూలమైన ప్రత్యక్ష పన్ను విధానాన్ని ఇది తీసుకురానుంది’ అని ఆదాయపు పన్ను విభాగం ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.ఆదాయపు పన్ను-2025 బిల్లును ఈ నెల 12న పార్లమెంటు ఆమోదించింది. సంక్లిష్టమైన పన్ను చట్టాలను సులభంగా అర్థం చేసుకునేందుకు సరళమైన భాషలో దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అనవసర నిబంధనలనూ తొలగించింది. 1961 నాటి చట్టంలోని 819 సెక్షన్ల సంఖ్యను 536కు, 47 అధ్యాయాలను 23కు తగ్గించింది. పదాల సంఖ్యా 5.12 లక్షల నుంచి 2.6 లక్షలకు తగ్గింది. స్పష్టత పెంచేందుకు కొత్తగా 39 పట్టికలు, 40 సూత్రాలూ ఇందులో ఉన్నాయి.

next post