ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన పార్టీ నేతలపై వస్తున్న విమర్శలు, వివాదాలకు తనదైన శైలిలో చెక్ పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.ముగ్గురు ఐఏఎస్‌లతో ఏర్పాటుచేసిన అంతర్గత కమిటీ ఇటీవల ఆయనకు నివేదిక సమర్పించింది. నియోజకవర్గాల్లో నాయకుల దూకుడును కట్టడి చేయడంతో పాటు అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టించాలన్న విషయంపై బాబు దృష్టి పెట్టారు.ప్రస్తుతం రెండు రకాలుగా ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. వీటి కారణంగానే నియోజకవర్గ స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదన్నది చంద్రబాబు గుర్తించిన విషయం. దీనికి అడ్డుకట్ట వేసి, నాయకుల జోక్యాన్ని నివారించి పనులు ముందుకు సాగేలా చేయాలని ఆయన భావిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మూడు నెలల కిందట అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్‌లు, ఓ కీలక అధికారి ఉన్నట్టు తెలిసింది. వీరు రూపొందించిన నివేదిక కూడా చంద్రబాబుకు చేరింది.దీనిలో ప్రధానంగా రెండు విషయాలను ప్రస్తావిస్తూ నాలుగు సూచనలు చేసినట్టు సమాచారం.నియోజకవర్గాల అభివృద్ధి పనులలో నాయకుల పాత్రను తగ్గించడంకమీషన్లు, దందాలకు చోటు లేకుండా పారదర్శకంగా వ్యవహరించడంఈ రెండు విషయాలపై ఫోకస్ పెంచడం ద్వారా పనులు చేయొచ్చని నివేదిక తెలిపింది. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంపైనా నిఘా పెంచాలని కీలక సూచన చేసింది.దీని లో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న పనులు, వాటిని తీసుకున్న కాంట్రాక్టర్లను అధికారులకు అటాచ్ చేస్తారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారికి తగ్గని అధికారులను ఈ పనులకు పురమాయిస్తారు.తద్వారా ఎప్పటి కప్పుడు లెక్కలు చూడడం, ఏ పనికి ఎంత జరిగిందో తేల్చడం వంటివి కీలకం. అంతేకాదు, నాయకుల ప్రమేయాన్ని కూడా వీరే పరిశీలిస్తారు. ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులకే నాయకులు విన్నవించాలని సూచించారు.ప్రతి పని పురోగతికీ సదరు అధికారిని బాధ్యుడిని చేయడం ద్వారా పనులు పారదర్శకంగా జరగడంతో పాటు నాయకుల ఒత్తిడి, ప్రమేయం కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు.