ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అఖండ సంకల్పంతో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, తన ప్రాణాల్ని అర్పించి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు త్యాగానికి గుర్తుగా… ఆ మహానీయుడి స్మృతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు.
ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ హామీని ప్రకటించారు. అంతకు మునుపు, యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇదే హామీని ప్రజలకు ఇచ్చారు. ఈ రోజు ఆ హామీ కార్యరూపం దాల్చింది.
నారా లోకేష్ గారు అమరావతిలో, ఈ మహాత్ముని విగ్రహ స్థాపనకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో, ఈ అద్భుతమైన విగ్రహం ఏర్పడనుంది.ఈ విగ్రహం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే స్ఫూర్తి సౌధంగా, పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని తరతరాలకు గుర్తు చేసే ప్రేరణాత్మక చిహ్నంగా నిలవనుంది.