Tv424x7
Andhrapradesh

సుగాలి ప్రీతి.. జ‌న‌సేన‌లో సునామీ ..!

కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి అనే విద్యార్థి 2017 లో అత్యాచారం, హత్యకు గురయ్యారు. ఇది జరిగిన‌ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజకీయంగా పెద్ద వివాదంగా మారుతోంది. ఈ కేసును విచారించి తమకు న్యాయం చేయాలని నిందితులను పట్టుకుని శిక్షించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి కోరుతున్నారు.

అయితే ఈ క్రమంలో జనసేన చుట్టూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ఎన్నికలకు ముందు చాలా ఆర్భాటంగా తమకు హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం తమకు మొహం కూడా చూపించడం లేదన్నది పార్వతీదేవి చేస్తున్న ప్రధాన ఆరోపణ.

అంతేకాదు తమకు న్యాయం చేయడం లేదని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత ఇటీవల పవన్ కళ్యాణ్ స్పందించారు.

తమకు సాధ్యమైనంత వరకు ఈ కేసులో న్యాయం చేశామని గత ప్రభుత్వంతో నష్టపరిహారంతో పాటు ఉద్యోగం ఇంటి స్థలం అదేవిధంగా పొలం కూడా ఇప్పించామని అని చెప్పుకొచ్చారు. అయితే నిందితులను పట్టుకోనప్పుడు ఇవన్నీ ఇచ్చి మాకు ప్రయోజనం ఏంటన్నది పార్వతీదేవి చేస్తున్న మరో ఆరోపణ.

ఈ క్రమంలోనే చంద్రబాబు స్పందించి ఈ కేసును మళ్ళీ సిబిఐ కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే జనసేన అధికార ప్రతినిధిగా ఉన్న ఒక నాయకుడు సుగాలి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ప్రభుత్వం నుంచి తీసుకున్న స్థలం.. పొలంతో పాటు ఉద్యోగాన్ని కూడా వెనక్కి ఇవ్వాలని ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సహజంగా ఇటువంటి వ్యాఖ్యలు సరికాదన్నది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మరి సదరు నేత ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియకపోయినా తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇప్పుడు ఇవి రాజకీయంగా జనసేన చుట్టూ వివాదం రేపుతున్నాయి. అసలే బాధలో ఉన్న కుటుంబాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు.

సదరు నేతపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వాలు పరిహారం ఇచ్చినప్పటికీ.. కేసు ఏమాత్రం ముందుకు పడకపోవడం, న్యాయం జరగకపోవడం ఆ కుటుంబాలను బాధిస్తూనే ఉంది. దీనికి తోడు రాజకీయంగా చేస్తున్న విమర్శలు సూటిపోటి మాటలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇటువంటివి మానుకోవాల్సిన అవసరం నాయకులకు చాలా ఉంది.

ప్రభుత్వాలు ఇచ్చే పరిహారానికి నిందితులను వదిలేస్తారా అనే చర్చ కూడా తెర మీదకు వచ్చింది. ఇప్పుడు జనసేన నేత చేసిన వ్యాఖ్యలు మరింత పరాకాష్టకు చేరాయి.

గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక కుటుంబానికి అన్యాయం జరిగితే అప్పటి వైసిపి ప్రభుత్వం కొంతమేరకు నష్టపరిహారం ఇచ్చి ఊర‌డించే ప్రయత్నం చేయగా ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం తమను పట్టించుకోవడం లేదన్న వాదన బలంగా వెళ్లడంతో దీని నుంచి బయటపడలేక కేసులో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయలేక ఇలా చేస్తున్నారా అనేది చర్చకు దారి తీసింది.

ఎంత అధికారం ప్రతినిధి అయినప్పటికీ సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఏదేమైనా సుగాలి ప్రీతి వ్యవహారం రాజకీయంగా దుమారమైతే రేపుతోంది. మరి ఇది ఎంత వరకు వెళ్తుంది.. ఏ మేరకు దీనిని జనసేన పరిష్కరిస్తుంది.. అనేది చూడాలి.

Related posts

నేడు పలాసలో సీఎం జగన్ పర్యటన

TV4-24X7 News

ఇంటర్ విద్యార్థులకు ఈ రోజే లాస్ట్

TV4-24X7 News

మ‌హానాడు చూశాక‌.. వైసీపీలో మార్పులు త‌ప్ప‌వా..!

TV4-24X7 News

Leave a Comment