కడప:“ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” అని అంటారు. కానీ ప్రస్తుతం ఆ ఉల్లిపాయ ధర రైతులను కన్నీరు పెట్టించే పరిస్థితి తెచ్చింది. ఉల్లి రైతులు నష్టాల్లో కూరుకుపోతుంటే, వ్యాపారులు మాత్రం లాభాలు ఆర్జిస్తున్నారు.రైతుల వద్ద 1 కిలో ఉల్లిపాయలు కేవలం రూ.3 నుండి రూ.5 మధ్య మాత్రమే పలుకుతుంటే, మైదుకూరు హోల్‌సేల్ మార్కెట్లలో మాత్రం 10 కిలోలు రూ.250కి అమ్మకాలు సాగుతున్నాయి. అంటే, రైతు కష్టానికి తగిన ధర రాకపోగా, మధ్యవర్తులు మాత్రం బంగారం చేసుకుంటున్నారు.“చేను బొందు పోయిన కూలి బొందు పోదు” అన్నట్లుగా దళారుల దగా కొనసాగుతోంది. రైతులు తక్కువ ధరకు అమ్మిన ఉల్లిని, “పాత గడ్డలు” అన్న సాకు చెప్పి మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు.మైదుకూరులోని ఎర్ర గడ్డల దుకాణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై అధికారులు చొరవ తీసుకొని దళారుల దోపిడీని అరికట్టాలని, వినియోగదారులు న్యాయమైన ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
