.
వీటికి కూడా మంచి గిరాకే మార్కెట్ లో…
కాకినాడ తీరంలో మత్స్యకారుల వలలో అరుదైన చేపలు చిక్కి స్థానికుల దృష్టిని ఆకర్షించాయి.
చూడగానే పాముల్లా కనిపించే ఈ జీవులు నిజానికి చేపలేనండోయ్.
వీటిని స్థానికంగా నల్ల బొమ్మిడాయిలు లేదా పాముచేపలు అని పిలుస్తారు.
సముద్ర గర్భంలో లోతైన ప్రదేశాల్లో వీటి వాసం ఉండటంతో తరచుగా వలల్లో చిక్కవు.
అందుకే ఒక్కసారి పట్టుబడితేనే పెద్దగా చర్చనీయాంశంగా మారతాయి.
ఆదివారం తెల్లవారుజామున సముద్ర యాత్రకు వెళ్లిన మత్స్యకారుల వలకు వీటిలో అనేకం చిక్కాయి. తిరిగి తీరానికి వచ్చిన తర్వాత వాటిని కుంభాభిషేకం రేవు వద్దకు తీసుకువచ్చి విక్రయించారు. అరుదైనవి కావడంతో వాటిని చూడటానికి స్థానికులు, కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.
సైజు ఆధారంగా కిలో ధర రూ.180 నుంచి రూ.250 వరకు పలికింది. పెద్దవాటికి ఎక్కువ ధర, చిన్నవాటికి కొద్దిగా తక్కువ ధర లభించింది. వీటి మాంసం రుచికరంగా ఉంటుందట. సముద్రంలో అరుదుగా లభించడం వల్ల ఎప్పటికప్పుడు ఎక్కువ మొత్తంలో దొరకవు.
మత్స్యకారులు ఈ పాముచేపలను మంచి ధరకు అమ్మి సంతృప్తి వ్యక్తం చేశారు. తీర ప్రాంతాల్లోని జనాలు కూడా ఇవి సముద్రంలో ఎలా జీవిస్తాయో తెలుసుకోవడానికి ఆసక్తిగా వీటిని పరిశీలించారు. ఇలా కాకినాడ తీరంలో అరుదైన చేపలు చిక్కడంతో.. రేవు ప్రాంతం కాసేపు సందడిగా మారింది.