Tv424x7
AndhrapradeshNational

జీఎస్టీ తగ్గింపు ఫలాలు దక్కేదెవరికి?


-డి. వెంకటేశ్వరరావు
విశ్రాంత సంయుక్త కమీషనర్
వాణిజ్యపన్నుల శాఖ

ఎట్టకేలకు జీఎస్టీ రేట్లలో మార్పులు సాకారమయ్యాయి. పన్ను శ్లాబులు రెండుకు తగ్గాయి. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు నిస్సందేహంగా దేశానికి మేలుచేసేవే. అయితే, ప్రజలకు పూర్తిగా లబ్ధి చేకూరాలంటే- పన్నురేట్లకు సమాంతరంగా ఆయా వస్తువుల ధరలు కూడా తగ్గాలి. అంటే, ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన ఫలితం వస్తువు ఖరీదు తగ్గడం ద్వారా వినియోగదారుడికి చేరాలి.

జీఎస్టీ పరోక్ష పన్ను కాబట్టి పన్ను చెల్లించే వ్యాపారులు దాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక వస్తువు ధర వంద రూపాయలు, దీనిపై జీఎస్టీ 12శాతం అనుకుంటే- వ్యాపారి వినియోగదారు నుంచి రూ.112 వసూలు చేసి, ప్రభుత్వానికి పన్నెండు రూపాయలు చెల్లిస్తాడు. ఇప్పుడు ఆ వస్తువుపై జీఎస్టీ 5శాతానికి తగ్గుతుంది కాబట్టి, వినియోగదారుల నుంచి వ్యాపారి రూ.105 మాత్రమే తీసుకోవాలి. జీఎస్టీ రాకముందు వస్తువులపై కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్‌ ఉండేవి.

ఇలాంటి బహుళ పన్నుల వ్యవస్థలో కేంద్రం లేదా రాష్ట్రాలు తగ్గించే పన్నుల మూలంగా వస్తువుల ధరలు తగ్గాయో లేదో తెలుసుకునే సౌలభ్యం వినియోగదారులకు ఉండేది కాదు. కానీ, జీఎస్టీ వచ్చిన తరవాత అలా పరిశీలించి నిర్ధారించుకోవడానికి అవకాశం లభించింది.

అటకెక్కిన అథారిటీ
వస్తువు ఖరీదులో ముడి సరుకుల ధరలు, తయారీకి అయ్యే ఖర్చు, దాన్ని వినియోగదారుడి దగ్గరికి చేర్చడానికి అయ్యే వ్యయం అన్నీ కలిసి ఉంటాయి. ద్రవ్యోల్బణం తదితర కారణాలతో ఇవన్నీ పెరగవచ్చు. కానీ, ఇవి క్రమేపీ పెరిగే ఖర్చులే తప్ప ఒక్కరోజులో ఎగబాకేవి కాదు. కాబట్టి, తగ్గిన పన్ను రేట్లు ఏరోజు నుంచి అమలులోకి వస్తాయో ఆరోజు నుంచే వస్తువుల ధరలు తగ్గాలి. అప్పుడే పన్ను తగ్గింపుపై ప్రజలు నిజంగా హర్షం వ్యక్తం చేస్తారు. అలా జరగకపోతే జీఎస్టీ హేతుబద్ధీకరణ ప్రయోజనాలు ప్రజలకూ, ప్రభుత్వానికీ ఇద్దరికీ దక్కవు.

పన్నులు తగ్గించినప్పుడు దాని ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చూడటానికి జీఎస్టీ చట్టంలోనే కొన్ని నిబంధనలు చేర్చారు. అతి లాభాపేక్ష వ్యతిరేక నిబంధన(యాంటీ ప్రాఫటీరింగ్‌ సెక్షన్‌) 171ను ఇందుకే ఉద్దేశించారు. దీని అమలుకు జాతీయస్థాయిలో యాంటీ ప్రాఫటీరింగ్‌ అథారిటీ సైతం ఏర్పాటైంది. పన్ను కోతల ప్రయోజనం వినియోగదారుడికి చేరలేదని ఈ అథారిటీ నిర్ణయిస్తే- వస్తువు వెల తగ్గించమని లేదా ఎక్కువగా వసూలుచేసిన సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించమని చెప్పవచ్చు.

పెనాల్టీ విధించడం, వ్యాపారి రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడం వంటి విస్తృత అధికారాలూ అథారిటీకి ఉన్నాయి. అయితే, వినియోగదారుల్లో అవగాహనా లోపం మూలంగా ఈ అథారిటీకి ఫిర్యాదులు తక్కువగానే వచ్చాయి. వాటి పరిష్కారం కూడా చాలా మందకొడిగా సాగడంతో 2022లో ప్రభుత్వం ఈ అథారిటీని రద్దు చేసింది. దాని పనిని కాంపిటీషన్‌ కమిషన్‌కు అప్పగించింది. అయితే, ఇది తమ పనికాదని కాంపిటీషన్‌ కమిషన్‌ నిరుడు చేతులెత్తేసింది. దాంతో ప్రభుత్వం మిగిలిన ఫిర్యాదులను జీఎస్టీ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌కు అప్పగించింది.

ఎవరైనా యాంటీ ఫ్రాఫటీరింగ్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే- ఏప్రిల్‌ 1, 2025లోపే చేయాలని, ఆ తరువాత వచ్చే ఫిర్యాదులను స్వీకరించమని అప్పుడే తెగేసి చెప్పింది. దీంతో యాంటీ ఫ్రాఫటీరింగ్‌ నిబంధనలు అటకెక్కాయి.

జీఎస్టీ చట్టంలో యాంటీ ఫ్రాఫటీరింగ్‌ నిబంధనలతో పాటు వ్యాపారి తాను చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువగా పన్ను వసూలు చెయ్యకూడదనే నిబంధన కూడా ఉంది. అలా వసూలుచేసింది అన్యాయ సంపద అవుతుంది కాబట్టి దాన్ని ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన సైతం ఉంది. అయితే, ఇవన్నీ పన్ను రూపంలో వసూలు చేసిన సొమ్ముకే వర్తిస్తాయి. కానీ ప్రభుత్వం పన్ను తగ్గించినప్పుడు ఆ ప్రయోజనం వినియోగదారుడికి చేరకుండా చేయడానికి వస్తువుల మూల ధరలనే పెంచే పద్ధతిని వ్యాపారులు అవలంబిస్తారు. అనేకానేక దుష్ఫలితాలు కలిగే ప్రమాదముంది కాబట్టి మూల ధరలను నియంత్రించే చట్టాలు చేయడం సాధ్యంకాదు.

ఆ బాధ్యత ప్రభుత్వానిదే
పన్ను తగ్గింపు ఫలాలను ప్రజలకు చేర్చడానికి యాంటీ ప్రాఫటీరింగ్‌ నిబంధనలే మేలైనవి. అయితే వీటిని మళ్లీ క్రియాశీలం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. దానికి బదులుగా పారిశ్రామికవేత్తలతో, వ్యాపారులతో చర్చించి వస్తువుల ధరలు తగ్గేలా చూస్తామని అంటున్నారు. పరిశ్రమవర్గాలు కూడా తగ్గించడానికి అంగీకరించాయనే కథనాలు వెలువడుతున్నాయి. అవి వాస్తవ రూపం దాల్చాలి.

ప్రభుత్వాలు పన్నులను తగ్గించడమే కాకుండా దాని ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా చూడటంపైనా శ్రద్ధ పెట్టాలి. పరోక్ష పన్నుల భారాన్ని అంతిమంగా వినియోగదారులే భరించాలి. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో వసూలైన రూ.22 లక్షల కోట్ల జీఎస్టీ ప్రజలు చెల్లించిందే. ఇప్పుడు రూ.40-60వేల కోట్ల దాకా పన్ను భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిశ్చయించింది కాబట్టి, ఆ ప్రయోజనం కచ్చితంగా ప్రజలకే అందాలి.

Related posts

నేడు పలాసలో సీఎం జగన్ పర్యటన

TV4-24X7 News

అమరావతికి భారీగా నిధులు

TV4-24X7 News

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం విల్లూరి భాస్కర్ రావు

TV4-24X7 News

Leave a Comment