దేశం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం ఓటేయండి:
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించాలని ఎంపీలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ
ఈ ఎన్నికలకు విప్ వర్తించదని, రహస్య ఓటింగ్ ఉంటుందని వెల్లడి
అంతరాత్మ ప్రభోధం మేరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన
పార్లమెంటరీ సంప్రదాయాలను పరిరక్షిస్తానని హామీ
దేశంలో ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన
ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పార్లమెంటు సభ్యులకు కీలక విజ్ఞప్తి చేశారు. దేశంపై ప్రేమ ఉంటే, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే తపన ఉంటే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇది కేవలం వ్యక్తిగత మద్దతు కోసం కాదని, భారత గణతంత్ర స్ఫూర్తిని నిలబెట్టడం కోసం వేసే ఓటు అని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు ఉభయ సభల ఎంపీలకు ఆదివారం ఆయన ఒక లేఖ రాశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ విప్ జారీ చేయదని, ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుందని గుర్తుచేశారు. అందువల్ల, ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మ ప్రభోధం మేరకే నడుచుకోవాల్సిన నైతిక బాధ్యత ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయని, పౌరుల హక్కులు ప్రమాదంలో పడ్డాయని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇస్తే, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకుని జాతీయ ప్రయోజనాలను కాపాడతానని హామీ ఇచ్చారు. నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ పార్లమెంటరీ సంప్రదాయాలను, చర్చల హుందాతనాన్ని పునరుద్ధరిస్తానని భరోసా ఇచ్చారు.
తాను తక్షణ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షిస్తానని ఆయన స్పష్టం చేశారు. కేవలం నిబంధనల అమలుకే పరిమితం కాకుండా, చర్చల పవిత్రతను కాపాడటం తన బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. భవిష్యత్తు తరాలు గర్వపడేలా మన గణతంత్రాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.