కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు కోసం అవసరమైతే ప్రభుత్వంపై పోరాడతానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారన్న కోమటిరెడ్డి
ఆలస్యమైనా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తానన్న కోమటిరెడ్డి
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం వేడెక్కాయి.
పార్టీల మధ్యనే కాకుండా, పార్టీలలోనూ అంతర్గత కలహాలు, పదవుల కోసం పోటీ, ప్రకటనలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి.
ఇటీవల బీఆర్‌ఎస్ నేత కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకే ఇబ్బందికరంగా మారగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
“మునుగోడు కోసం పోరాడుతాను… మంత్రి పదవి కోసం ఎదురుచూస్తా” – రాజగోపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
“మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను. అవసరమైతే ప్రభుత్వంపై పోరాటానికి కూడా సిద్ధం. ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ఒత్తిడి తెస్తాను. పార్టీలో చేరినప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆలస్యమైనా పర్వాలేదు, నేను వేచి చూస్తాను,” అని ఆయన అన్నారు.
ఇదివరకే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు, అదే పదవి కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తానని చెప్పడం, మరోవైపు మునుగోడు ప్రజల కోసం పోరాటానికి సిద్ధమని ప్రకటించడం రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
పార్టీలో కీలక పాత్ర పోషించాలనే కోరికను దాచుకోకుండా బయటపెట్టిన ఆయన, ప్రజల కోసం త్యాగం చేస్తాననే ధోరణితో ఒక రకమైన వ్యూహాత్మక శైలిని అనుసరిస్తున్నారని కొందరు అంటున్నారు. ఇది కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.