– మహిళా పోలీసుల పర్యవేక్షణలో కేంద్రాల ప్రారంభం??-
తాళాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న అంగన్వాడీలు అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, సహాయకుల నిరవధిక సమ్మె కారణంగా కేంద్రాల నిర్వహణకు ఐసిడిఎస్ అధికారులు ప్రయత్నామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం నుంచి అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు చర్యలు తీసుకోనునట్లు సమాచారం. గ్రామ సచివాలయాల మహిళా పోలీసుల ఆధ్వర్యంలో వెల్ఫేర్ అసిస్టెంట్ల పర్యవేక్షణలో కేంద్రాల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల ద్వారా పిల్లలకు భోజనం పెట్టేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీ కేంద్రాల టీచర్ల నుంచి కేంద్రాల తాళాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాళాలు ఇవ్వకపోయినా కేంద్రాలకు వేసి ఉన్న తాళాలను వీఆర్వోల సమక్షంలో పగులకొట్టేందుకు ఐసిడిఎస్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. శుక్రవారం నుంచి కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.