Tv424x7
Andhrapradesh

ప్రజాపాలన.. ఆరు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ‘ప్రజాపాలన’ దరఖాస్తులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు..ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన లోగోను ఆవిష్కరించారు. ఇవి రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి. ఆరు పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిస్సహాయులకు సాయం అందించడమే తమ లక్ష్యమని, ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదని… ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకు వెళ్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తాము ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చామని, డిసెంబర్ 7వ తేదీన తమ ప్రభుత్వం ఏర్పాటయిందని… జనవరి 7వ తేదీ లోపు సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేస్తున్నామన్నారు. రేపటి నుంచి గ్రామ, వార్డు సభలు ఉంటాయన్నారు. ఈ సభల ద్వారా ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆరు గ్యారెంటీలను అర్హులైన వారికి ఇస్తామన్నారు. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కోసం సభలు నిర్వహిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. గత పదేళ్లుగా ప్రభుత్వం… ప్రజలకు అందుబాటులో లేదని, ఇప్పుడు ప్రభుత్వం.. అధికారులు ప్రజలకు చేరువై సమస్యలు పరిష్కరిస్తారన్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మారుమూల పల్లెలలకు కూడా సంక్షేమ పథకాలు అందాలన్నారు. అర్హులు ఎవరూ కూడా ఎవరి కోసం ఎదురు చూడవద్దని… ఎవరి వద్దకు వెళ్లవద్దని.. ప్రభుత్వమే వారి వద్దకు వస్తుందన్నారు. ప్రజాపాలనకు సంబంధించి ప్రతి మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తామని, ఓ గ్రూప్కు ఎండీవో, మరో గ్రూప్కు ఎంఆర్వో బాధ్యత వహిస్తారన్నారు. అయితే ఈ పది రోజులు కేవలం స్పెషల్ డ్రైవ్ మాత్రమేనని.. తర్వాత కూడా అర్హులకు పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జనవరి 7వ తేదీ లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించే పని చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుతో ప్రభుత్వానికి అన్ని వివరాలు అందుతాయన్నారు. ఎన్ని రోజుల్లో వీటిని పరిష్కరిస్తామనేది చూస్తామన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. ఒకవేళ దరఖాస్తులో ఏదైనా సమస్య ఉంటే దరఖాస్తుదారుకు చెబుతామన్నారు.

Related posts

కొడాలి నాని నామినేషన్ పై వివాదం

TV4-24X7 News

స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు

TV4-24X7 News

ఓటరు ఐడీ కార్డులో ఏదైనా తప్పులు ఉన్నాయా? ఈ విధంగా అప్‌డేట్ చేసుకోండి

TV4-24X7 News

Leave a Comment