రైతు సమస్యలపై కేంద్రం వ్యవహారశైలిని నిరసిస్తూ ఇవాళ దాదాపు 200కు పైగా రైతుల సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు అన్నదాతలు ఢిల్లీ ఛలో కార్యక్రమానికి పిలుపునిచ్చారు.యూపీ, హర్యానా, పంజాబ్ తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తరలివస్తున్న రైతులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్దితులు నెలకొంటున్నాయి. ఆరు నెలల పాటు ఢిల్లీలో నిరసనలకు సిద్ధమై రైతులు తరలివస్తున్నారు.పంజాబ్ హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దుల వద్ద రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వారు బ్యారికేడ్లు తొలగించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్దితి అదుపు తప్పింది. ఆగ్రహించిన అన్న దాతలు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి.వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులతో పాటు రాజధాని ప్రాంతంలోనూ సెక్షన్ 144తో పాటు భారీగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. భారీగా పారా మిలిటరీ బలగాలను మోహరించారు. అయినా రైతులు ఆంక్షల్ని దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో భారీ ఎత్తున మోహరించిన బలగాలు, ఆంక్షల కారణంగా సాధారణ జన జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనిపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు సుప్రీంకోర్టు లాయర్లు ఇవాళ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు..

previous post