జోసఫ్‌పేట సమస్యలను వెంటనే పరిష్కరించాలి: వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మైదుకూరు, జూలై 26: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని జోసఫ్‌పేటలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గుర్రయ్య, యూటీఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు.ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో “సామాజిక శంఖారావం” కార్యక్రమం నిర్వహించి జోసఫ్‌పేటలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న పలు సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం వారు మాట్లాడుతూ, నివాసాలకు అతి సమీపంలో స్మశానం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్మశానంలో తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, నివాసాలకు ఇబ్బంది కలగకుండా ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు.జోసఫ్‌పేటలో వందకు పైగా దళిత కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగు నీరు ఇండ్ల మధ్యగానే ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.పక్కనే కే.సీ. కెనాల్ కాలువ ఉన్నప్పటికీ రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ఉన్నప్పటికీ ఇప్పటికీ అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారని, వెంటనే సొంత భవనం నిర్మించాలని కోరారు.అదేవిధంగా అర్హులైన అనేక కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరు కాలేదని, కొత్త ఇళ్లను మంజూరు చేయడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేసి జోసఫ్‌పేట ప్రజల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు షరీఫ్, రవి, పోలయ్య, నాగేష్, ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *