తక్కువ ధరకు బంగారం పేరుతో రూ.6.50 లక్షల మోసం
అంతర్‌జిల్లా మోసగాడు అరెస్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏఎస్పీ విభూ కృష్ణన్
ప్రొద్దుటూరు, జూలై 26 (స్థానిక ప్రతినిధి): తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.6.50 లక్షలు కాజేసిన అంతర్‌జిల్లా మోసగాడిని ప్రొద్దుటూరు ఐ-టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవద్దని ప్రొద్దుటూరు ఏఎస్పీ యు. విభూ కృష్ణన్, ఐపీఎస్ సూచించారు.ఆదివారం ప్రొద్దుటూరు ఐ-టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. వసంతపేటకు చెందిన ఫోటోగ్రాఫర్ బెల్లాల రవికుమార్‌కు తిరుపతి జిల్లా పుత్తూరు మండలం వినాయకపురానికి చెందిన కన్నయ్య అలియాస్ ప్రసాద్ పరిచయమై, తక్కువ ధరకే బంగారం తయారు చేసి ఇస్తానని నమ్మబలికాడు. లక్ష రూపాయలకు 100 గ్రాముల బంగారం ఇస్తానని చెప్పడంతో బాధితుడు రూ.5 లక్షలు చెల్లించగా, ఇతర ఖర్చుల పేరుతో మరో రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. అనంతరం నకిలీ బంగారు కడ్డీ ఇచ్చి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ కొండారెడ్డి పర్యవేక్షణలో ఐ-టౌన్ ఎస్‌ఐ జి. మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం ఎర్రగుంట్ల బైపాస్‌లోని వాసవి సర్కిల్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.నిందితుడి వద్ద నుంచి సుమారు 100 గ్రాముల బంగారు కోటింగ్ ఉన్న నకిలీ కడ్డీ, ఒక ల్యాప్‌టాప్, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఏఎస్పీ విభూ కృష్ణన్ మాట్లాడుతూ, తక్కువ ధరకే బంగారం, గుప్తనిధులు, అద్భుత లాభాలు అంటూ వచ్చే ఆఫర్లు కచ్చితంగా మోసమేనని, ఇలాంటి ప్రలోభాలకు ఎవరూ లోనుకావద్దని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.