హైదరాబాద్, జూలై 26: గ్లోబరీనా సంస్థకు సంబంధించిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం.
గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
నిర్దేశించిన గడువులోగా క్షమాపణ చెప్పని పక్షంలో సివిల్, క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తామని లీగల్ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.